అనన్య న్యూస్, జడ్చర్ల: తెలంగాణలో ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని టిపిసిసి ప్రధాన కార్యదర్శి, జడ్చర్ల నియోజకవర్గం ఇంచార్జ్ జనంపల్లి అనిరుద్ రెడ్డి పేర్కొన్నారు. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలకు నిరసనగా గురువారం జడ్చర్ల మండల కేంద్రంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలో టౌన్ కాంగ్రెస్ నాయకులు సీఎం కేసీఆర్ పది తలల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఏం అభివృద్ధి చేసిందని దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో హామీలు ఇవ్వడమే గాని వాటిని అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. పదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఓటమి భయంతో రాష్ట్రంలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని, రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశంలో, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళ నాయకురాలు, ఎన్ ఎస్ యు ఐ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.