అనన్య న్యూస్, జడ్చర్ల: తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జడ్చర్ల మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన విద్యా దినోత్సవంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఉపాధ్యాయులు పనిచేయడంతో నేడు ప్రభుత్వ పాఠశాలలు అద్భుత ఫలితాలను సాధిస్తున్నాయన్నారు. ఉపాధ్యాయులకు మరింత గౌరవం పెరిగిందన్నారు.
2014 ముందు నియోజకవర్గంలో 5 జూనియర్ కళాశాలలే ఉండేవని, ప్రస్తుతం 12 కొత్త జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. గురుకులాల్లో ఒక్కో విద్యార్థి పై ప్రభుత్వం 1,20,000 ఖర్చు చేస్తుందని, కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తుండడంతో నేడు ఎంబిబిఎస్, నీట్, ఇంజనీరింగ్ విద్యలో ప్రభుత్వ విద్యార్థుల రాణిస్తున్నారాని అన్నారు. ఇన్ని మంచి పథకాలు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ కు తెలంగాణ ప్రభుత్వానికి మనమందరం రుణపడి ఉండాలని, పనిచేసే ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు.
విద్యా దినోత్సవంలో మండలంలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, జిసిసి చైర్మన్ వాల్యా నాయక్, జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, ఎంఈఓ మంజులాదేవి, జడ్పీ సీఈవో జ్యోతి, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.