అనన్య న్యూస్, జడ్చర్ల: త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని, ఇవ్వని పార్టీలను ఓడిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ అధ్యక్షతన జడ్చర్ల పట్టణంలోని లైన్స్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాలలో ప్రజా బలం కలిగిన బీసీ నాయకులను పక్కకు నెట్టి అగ్రకుల నాయకులకు, పెట్టుబడిదారులకు పార్టీ టికెట్లు కేటాయిస్తున్నాయని, నియోజకవర్గంలో 60 శాతంకు పైగా బీసీలు ఉన్నారని సామాజిక న్యాయస్ఫూర్తితో జనాభా దామాషా ప్రకారం పాలనలో వాటా కావాలని డిమాండ్ చేశారు.
ఇది ప్రజా స్వామ్య దేశమని జనాభా దామాషా ప్రకారం విద్యా, ఉద్యోగ, రాజకీయ ఆర్థిక పారిశ్రామిక రంగాలలో బీసీలకు సమాన వాట చెందాలని, లేని యెడల వచ్చే ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలకు బీసీలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఏడు శాతం ఉన్న అగ్రకులాల వాళ్ళు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో 90 శాతం వాటా పొందుతున్నారని, 93 శాతం ఉన్న బహుజనులు అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 18 జిల్లాల నుండి బిసి సామాజిక వర్గానికి చెందిన ఒక శాసనసభ్యుడు కూడా లేడని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అన్ని జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులను బరిలోకి దింపుతామని అన్నారు.
కార్యక్రమంలో బీసీసేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణయాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్య నారాయణ, విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ, బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు, బీసీ రక్షక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కా చంద్రమోహన్, బీసీ నాయకులు జహంగీర్ పాషా, నిరంజన్, సురభి విజయ్ కుమార్, గోపాల్, రామస్వామి, గౌరీ శంకర్, కట్ట మురళి, సురభి రఘు, నెక్కొండ చారి, శివ రాములు, ఆలూర్ నర్సిములు, శ్రీనివాస్, వెంకటేష్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.