- దాతల సహకారంతో దేవాలయ పునఃనిర్మాణం..
అనన్య న్యూస్, జడ్చర్ల: భక్తులు కోరిన కోరికలు తీర్చే దైవంగా కావేరమ్మపేట శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవత భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట డాగ్ (ఐబి) బంగ్లా సమీపంలో 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవత నిత్య పూజలతో పాటు ప్రతి శుక్రవారం అభిషేకం, కుంకుమార్చనలు అందుకుంటూ దినదినాభివృద్ధి చెందుతోంది.

శ్రీ బంగారు మైసమ్మ తల్లికి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఆదివారం బోనాల పండుగ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. బోనాల పండుగ మహోత్సవంలో మున్సిపాలిటీ పరిధిలోని మహిళలు బోనాలతో అమ్మవారికి నైవేద్యాలను సమర్పించి మొక్కులను తీర్చుకుంటారు. గ్రామ పెద్దలు, భక్తులు, యువతి, యువకులు బోనాల మహోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటారు.
ప్రతి ఆదివారం, మంగళవారం భక్తులు అమ్మవారికి మేక పొటేళ్లను, కోడిపుంజులను నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన దేవాలయ స్థానంలో దాతల సహకారంతో అంగరంగ వైభవంగా నిర్మాణం పూర్తి చేసుకున్న దేవాలయంలో శ్రీ బంగారు మైసమ్మ తల్లి పిలిస్తే పలికే అమ్మగా భక్తుల నీరాజనాలు అందుకుంటోంది.