అనన్య న్యూస్, జడ్చర్ల: దశాబ్దాలుగా తండాలను ఏపాలకులు పట్టించుకోలేదని, తండాలను అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో వాటిని గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం బాలనగర్ మండలం పోచమ్మగడ్డ తండాలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటించారు. తండాలో నిర్మించిన పలు సీసీరోడ్లు, పోచమ్మగడ్డ తండా నుండి చిన్న రెవల్లే వరకు నిర్మించిన బీటీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలని, క్షేత్రస్థాయిలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
తండాలను పంచాయతీలు చేయడంతో తాండలు అభివృద్ధి బాట పట్టాయని, మిషన్ భగీరథతో తాగునీటితో పాటు రహదారులను అభివృద్ధి చేయడంతో రవాణా వ్యవస్థ కూడా మెరుగైందన్నారు. గతానికి ఇప్పటికీ తాండలలో జరిగిన అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకోవాలని, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రజలు చర్చించుకోవాలని అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.