అనన్య న్యూస్, జడ్చర్ల: తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని, దశాబ్దాలుగా తండాలను ఏ నాయకులు, పార్టీలు పట్టించుకోలేదని, తండాలను కూడ అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో వాటిని సీఎం కేసీఆర్ గ్రామ పంచాయతీలుగా మార్చారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం జడ్చర్ల మండలం దేవునిగుట్ట తండాలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటించారు. అనంతరం తండాలో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి గ్రామాలే పట్టుగొమ్మలని, క్షేత్రస్థాయిలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు. తండాలను పంచాయతీలు చేయడంతోనే నేడు తాండలు అభివృద్ధి బాట పట్టాయని, మిషన్ భగీరథతో తాగునీటితో పాటు రహదారులను అభివృద్ధి చేయడంతో రవాణా వ్యవస్థ కూడా మెరుగైందన్నారు. గతానికి ఇప్పటికీ జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని, పనిచేసే ప్రభుత్వం వెన్నంటే ఉండాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, సర్పంచ్ కె. రాములు, పిఎసిఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్, నాయకులు బాబు నాయక్ తదితరులు ఉన్నారు.