అనన్య న్యూస్,జడ్చర్ల: మూడు గంటల కరెంటు ఇచ్చి అన్నదాతలను ఆగం చేసే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా, వ్యవసాయానికి నిరంతర వెలుగులు ప్రసరింపజేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా అని ప్రజలు రైతులు గ్రామాల్లో చర్చ జరపాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్ విధానాన్ని ఖండిస్తూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు కాకర్లపాడు, రాజాపూర్, ఉడిత్యాలలోని రైతు వేదికల వద్ద నిర్వహించిన సమావేశాలకు మహబూబ్ నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డితో కలసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు.
వ్యవసాయంపై కనీసం అవగాహన లేకుండా మూడు గంటల కరెంటుచాలని, ఒక ఎకరా గంటలో పారుతుందని ఇస్టారీతిగా మాట్లాడడం రైతులను అవమానించడమేనని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ మూడు గంటల కరెంటు ఇచ్చిందని, రేపు ఒకవేళ తాము అధికారంలో వచ్చినా కూడా మూడు గంటలు ఇస్తామని కాంగ్రెస్ విధానాన్ని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారనే విషయాన్నీ రైతులు గమనించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తే రైతులకు ఉచిత విద్యుత్తు రద్దు చేస్తుందన్నారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రతి రైతు దగ్గరికి పార్టీ కార్యకర్తలు, నాయకులు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కోరారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.