అనన్య న్యూస్, జడ్చర్ల: బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జడ్చర్ల బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు బిజెపి మండల కమిటీ ఆధ్వర్యంలో జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ముందస్తు సమాచారంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ముందస్తుగానే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగ బిజెపి నాయకులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఒక్కసారిగా దూసుకు రావడంతో పోసులు వారిని నిలవరించే ప్రయత్నం చేశారు.
వారిని అరెస్టు చేసే క్రమంలో బిజెపి శ్రేణులు పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. దాంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. అనంతరం వారిని అరెస్టు చేసి ప్రత్యేక వాహనంలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2014, 2018 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికలప్పుడు ప్రజలకు, హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోయారని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడి చేశామన్నారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన వారిని బిజెపి జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి పరమర్శించారు.
కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రాపోతుల శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు సామల నాగరాజు, మండల అధ్యక్షుడు రమేష్ జి, మహిళా నాయకురాలు బాలా త్రిపుర సుందరి, కౌన్సిలర్ కుమ్మరి రాజు, వెంకట్, అనంత కిషన్, శ్రీనివాస్ గౌడ్, బుక్క నవీన్, పిట్టల నరేష్, మల్లేష్, మహేష్, మహేందర్, జగదీష్, శివ, భరత్ పాల్గొన్నారు.