అనన్య న్యూస్, నవాబుపేట్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇల్లు లేని నిరుపేదలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని టిపిసిసి ప్రధాన కార్యదర్శి, జడ్చర్ల నియోజకవర్గ ఇన్చార్జ్ జనంపల్లి అనిరుద్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా ప్రజా శ్రేయస్సుకై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాహిత పాదయాత్రకు అనిరుద్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
ఆదివారం జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని జడ్చర్ల, గంగాపూర్, బాదేపల్లి, గొల్లపల్లి, నవాబుపేట కేంద్రాలలో ఉన్న పలు హిందూ దేవాలయాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని దర్గాలను, చర్చిలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నవాబ్ పేట్ మండల పరిధిలోని ఫతేపూర్ మైసమ్మ ఆలయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పూజలు చేసి మైసమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం టిపిసిసి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు తో కలిసి పాదయాత్ర ప్రారంభించారు.

ఈ సందర్భంగా అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ జడ్చర్ల నియోజకవర్గంలో కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం అయ్యిందని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకే ప్రజలకు తామున్నామని భరోసా కల్పిస్తూ, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ప్రజాహిత పాదయాత్ర చేపట్టినట్టు తెలిపారు. తొమ్మిదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ప్రజలకు కనీసం రేషన్ కార్డులు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇండ్లు కట్టుకునేందుకు మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇవ్వలేదని విమర్శించారు. నియోజకవర్గ పరిధిలోని ఉదండాపూర్ రిజర్వాయర్ బాధితులకు న్యాయం చేయలేకపోయారని, ఇప్పటివరకు ముంపుకు గురైన గ్రామాల ప్రజలకు పునరావసం కల్పించలేకపోయారని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పేదల బతకులు బాగుపడతాయని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయనీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే వంటింటి మహిళలకు రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, నిరుద్యోగులకు 4016 నిరుద్యోగ భృతి అందిస్తామని అన్నారు. కారుకొండ గ్రామంలో నిర్వహించిన ప్రజాహిత పాదయాత్ర కార్నర్ మీటింగ్ కు భారీగా హాజరైన ప్రజలను ఉద్దేశించి అనిరుద్ రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, అధికార ప్రతినిధులు దుష్యంత్ రెడ్డి, సంపత్ కుమార్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ గౌస్, రబ్బాని, జడ్చర్ల నియోజకవర్గ నాయకులు బుక్క వెంకటేశం, నిత్యానందం, అశోక్ యాదవ్, సర్ఫరాజ్, బుచ్చన్న, కాజా, గోపాల్, నర్సింలు, పర్వతాలు, వంశీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.