అనన్య న్యూస్, జడ్చర్ల: తెలంగాణ కోసం ఉద్యమంలో ముందుండి పోరాడి ప్రాణతాగం చేసిన అమరుల వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జడ్చర్ల మున్సిపాలిటీ కార్యాలయంలో అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు అమరవీరుల ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతూ మౌనం పాటించారు. అనంతరం సిగ్నల్ గడ్డ అంబేద్కర్ చౌరస్తా లో ఉన్న అమరుడైన శ్రీకాంత్ ఆచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ లక్ష్మీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎంతో మంది యువకులు ఆత్మబలి దానాలు చేసుకున్నారని, వారందరి బలిదానాల ఫలితమే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అయిందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ సారిక, కమిషనర్ మహమూద్ షేక్, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.