అనన్య న్యూస్, జడ్చర్ల: స్వరాష్ట్రంలోని గ్రామాలు అభివృద్ధి చెందాయని, గత తొమ్మిది ఏళ్లలో పల్లెలు, పట్టణాల్లో మౌలిక వసతులు పెరిగాయని, ప్రజల జీవన ఆర్థిక స్థితిగతులు మెరుగయ్యాయని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం జడ్చర్ల మండలం మాచారం గ్రామంలో రూ.20.00 లక్షల నిధులతో నిర్మించబోయే నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పాలకులు పంచాయతీలను పట్టించుకోలేదని, చెత్తా చెదారం పేరుకుపోయి ప్రజలు రోగాల బారిన పడేవారని, అంటు వ్యాధులు ప్రభలేవని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక ఆపరిస్థితి లేదన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనం, హరితహారం, సెగ్రిగేషన్ షెడ్డు, వైకుంఠ ధామాలు ఏర్పాటు చేసి పల్లెలకు సీఎం కేసీఆర్ జీవం పోశారని, ప్రస్తుతం జరిగిన, జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలు గమనించాలని, పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు.
30 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరిక
మాచారం గ్రామం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో 30 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, గ్రామ సర్పంచ్ రవీందర్ రెడ్డి, రైతుబంధు అధ్యక్షులు జంగయ్య, ఏఎంసి చైర్మన్ గోవర్ధన్ రెడ్డి నాయకులు రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.