అనన్య న్యూస్, జడ్చర్ల: మున్సిపాలిటీలో పందుల తరలింపు వివాదంగా మారింది. స్థానిక మున్సిపాలిటీ పాలకవర్గం పందుల పెంపకం దారుల మధ్య చోటు చేసుకున్న పందుల పంచాయితీ రోజు రోజుకు తీవ్రమై ఏకంగా పోలీస్ స్టేషన్ కు చేరింది. పందులు అమ్ముకున్నారని వస్తున్న ఆరోపణలు మున్సిపాలిటీ పాలకవర్గానికి తలనొప్పిగా మారాయి. ఇటీవల జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మున్సిపాలిటీలోని ఇళ్ల నిర్మాణ అనుమతుల విషయంలో కౌన్సిలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని, పందులను పాలకవర్గ సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు అమ్ముకున్నారని, వాటిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు. ఈ విషయం స్థానికంగా తీవ్ర దుమారం రేపింది.
మున్సిపల్ కార్యాలయంలో శనివారం చైర్ పర్సన్ లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ సారిక, కౌన్సిలర్లు ప్రశాంత్ రెడ్డి, రఘురాంగౌడ్, నందికిశోర్ గౌడ్, జ్యోతి, చైతన్య, సతీష్, మహేష్ తదితరులు ఈ విషయంపై విలేకరులతో మాట్లాడారు. ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకుంటే అన్ని ధ్రువపత్రాలు సక్రమంగా ఉన్నవారికి కమిషనర్ ఇళ్ల నిర్మాణ అనుమ తులు ఇస్తారని తెలిపారు. ఏవైనా లోపాలు ఉంటే టాస్క్ పోర్సు బృందం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ విషయంలో కౌన్సిలర్లపై ఆరోపణలు చేయటం తగదన్నారు. జడ్చర్ల పట్టణంలో పందుల సంఖ్య పెరగటంతో ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని, రైతుల పంటలు దెబ్బతింటున్నాయని ఎన్నికలకు ముందు ఫిర్యాదులు వచ్చాయని, పందులను అరికట్టాలని అప్పటి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సూచించారని తెలిపారు. గత కమిషనర్ తో పాటు ప్రస్తుత కమిషనర్ వచ్చాక పందుల పెంపకందారులకు నోటీసులు ఇచ్చిన వారు ఇతర ప్రాంతాలకు తరలించ లేదన్నారు.
అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పెంపకందారుల సమక్షంలోనే పందులను పురపాలిక సభ్యుల సహకా రంతో జడ్చర్ల నుంచి తరలించామన్నారు. వాటిని ఎక్కడికి తీసుకెళ్లారో ఎవరు అమ్ముకున్నారో తెలియదన్నారు. తమపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఈ విషయంలో చట్టపరంగా ఆధారాలు ఉంటే చర్యలు ఉంటాయన్నారు. ఇదే సమయంలో పందుల పెంపకందారుడు బాలస్వామి జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. తాను ఓ కేసు విషయంలో జైలుకు వెళ్ళినప్పుడు తమకు సంబంధించిన పందులను చైర్ పర్సన్ భర్త రవీందర్ అమ్ముకున్నారని ఆరోపించారు. ఫిర్యాదు వచ్చిన విషయం వాస్తవమేనని పోలీసులు తెలిపారు. పందులను అమ్ముకున్నారనే వ్యవహారంపై న్యాయ సలహా తీసుకుని కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు.