అనన్య న్యూస్, జడ్చర్ల: అక్రమంగా మద్యం తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని జీఎస్టీ అదికారులు పట్టుకున్నారు. జడ్చర్ల సీఐ రమేష్ బాబు కథనం ప్రకారం 44వ జాతీయ రహదారి జడ్చర్ల పైవంతెన సమీపంలో భూత్పూర్ నుంచి రాజాపూర్ వైపు వెళ్తున్న డీసీఎంను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మంగళవారం అర్ధరాత్రి తనిఖీ చేశారు. అందులో ధ్రువీకరణ పత్రాలు లేకుండా దాదాపు రూ. 10లక్షల విలువైన 400 కార్టన్ల మద్యం ఉన్నట్లు గుర్తించారు. సాధారణ దుస్తుల్లో తనిఖీలు ఎలా చేపడతారని అధికారులతో వాగ్వాదానికి దిగిన కొందరు వ్యక్తులు వాహనాన్ని తీసుకొని వెళ్లిపోయారు. తనిఖీ చేసిన రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ తాటికొండ అశోక్ కుమార్ జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో పోలీసులు నంబరు ఆధారంగా వాహనాన్ని పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి జిల్లా పోలీసు శిక్షణ కేంద్రానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు.