అనన్య న్యూస్, జడ్చర్ల: బిజెపి, బిఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటే అన్న విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. జడ్చర్లలో శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్ధి అనిరుద్ రెడ్డి నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించగా నేతాజీ కూడలిలో ఏర్పాటు చేసిన సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడారు. కొన్ని రోజులుగా కాంగ్రెస్ నాయకుల ఇళ్లపైనే ఐటీ దాడులు జరుగుతున్నాయని, సీఎం కేసీఆర్ కుటుంబంపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే ఎం.చంద్రశేఖర్ బతిమాలితేనే కాంగ్రెస్ లో చేర్చుకున్నామని, డబ్బులకు అమ్ముడు పోయి బిఆర్ఎస్ లో చేరారని ఆరోపించారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే ఉదండాపూర్ నిర్వాసితులకు మల్లన్నసాగర్ కంటే ఎక్కువ పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. యువకుడైన అనిరుధ్ రెడ్డికి అన్ని విధాల సహకరించి జడ్చర్ల నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తామన్నారు. ఇటీవల కాంగ్రెస్ లో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే భూములు కబ్జా చేస్తున్నారని, మరో మారు గెలిపిస్తే ఇబ్బందులు తప్పవని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఎవరి భూములు కబ్జా కాకుండా చూస్తానని, నియోజకవర్గం అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు. ర్యాలీలో వేలాది మంది పాల్గొనటంతో రోడ్లన్నీ కిక్కిరిసి పోయాయి.