అనన్య న్యూస్, ఊర్కొండ: నియోజకవర్గ పరిధిలోని దేవాలయాలకు సంబంధించిన భూములను కాపాడుతానని, దేవాలయ భూములు కబ్జాకు గురైతే కఠిన చర్యలు తీసుకుంటామని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. ఊరుకొండ మండలంలోని రేవల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆయుబ్ పాష మొక్కుకి మద్దతుగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పాల్గొని ఊర్కొండ పేట శ్రీ ఆంజనేయస్వామీని దర్శించుకొని మోక్కును తీర్చుకున్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన శుభ సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఊర్కొండపేటలోని శ్రీపబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయానికి సంబంధించిన భూములను వెంటనే సర్వే చేసి సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని తాహాసిల్దార్ ను ఆదేశించారు. దేవాలయానికి సంబంధించిన ఆదాయాన్ని దేవాలయ అభివృద్ధికి ఉపయోగించాలని ఈఓని ఆదేశించారు. దేవాలయానికి సంబంధించిన భూములు కబ్జాకు గురైతే చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.