- ప్రజలు లేకుండానే పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ.
- పోలేపల్లి సెజ్ లో కాలుష్య రహిత పరిశ్రమలు స్థాపించాలి.
- టీఎస్ఐఐసీ ప్రజాభిప్రాయ సేకరణలో సేజ్ పరిసర ప్రాంత ప్రజల డిమాండ్..
అనన్య న్యూస్, జడ్చర్ల: సెజ్ లో కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలను మూసివేయాలని జడ్చర్ల మండలం పోలేపల్లి, ముదిరెడ్డిపల్లి, రాయపల్లి గ్రామాల ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. జడ్చర్ల మండల పరిధిలోని పోలేపల్లి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ లో మంగళవారం పరిశ్రమల కాలుష్యంపై అదనపు కలెక్టర్ సీతారామారావు, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సంగీత లు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. పోలేపల్లి, గుండ్లగడ్డతండా, రాయపల్లి, ముదిరెడ్డిపల్లి తదితర గ్రామాల ప్రజలకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు తెలియకుండా ప్రజాభి ప్రాయ సేకరణ ఎలా చేస్తారని రాయపల్లి సర్పంచి గంగాధర్ గౌడ్, సామాజిక కార్యకర్త కోస్గి వెంకటయ్య, రైతులు గణేశ్, యాదయ్య, న్యాయ వాది సునీల్ నిలదీశారు. కాలుష్యం లేని పరిశ్రమ లపై తమకు అభ్యంతరం లేదని చెప్పారు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతూ కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలను మూసివేయాలని, యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండు చేశారు. లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్తామని హెచ్చరించారు.

పంటలు పాడవుతున్నా యని, నీటి, వాయు, భూమి కాలుష్యాలతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులకు ఉపాధి కల్పించడంలేదని అసహనం వ్యక్తం చేశారు. ఫార్మా పరిశ్రమ కోసం తమ కుటుంబం 9 ఎకరాల భూమిని కోల్పోతే తమకు పని కల్పించడంలేదని రాజునాయక్ ఆవే దన వ్యక్తంచేశారు. తహసీల్దారు, రాజకీయ నాయకులు పరిశ్రమల వారితో లాలూచీ పడుతున్నారని ఆరోపించారు. తనకు చిన్న పిల్లలున్నారని, భూమి కోల్పోవటంతో జీవనం కష్టంగా మారిందని మంగ్లీ అనే గిరిజన మహిళ కంటతడి పెట్టారు. ఆమెను జిల్లా కలెక్టర్ కార్యాలయాలనికి రావాలని అదనపు కలెక్టర్ సూచించారు.
స్వచ్ఛంద సంస్థల ప్రతిని ధులు మధుబాబు, జనార్దన్ రెడ్డి, చెన్న కేశవ రెడ్డి. టీఎల్ఎన్ రావు, వెంకట్ రెడ్డి, అశోక్ రావు, సునందారెడ్డి, సయ్యద్, సత్యనారాయణ, శంకర్ రావు తదితరులు కూడా స్థానికుల ఆరోపణలతో ఏకీభ వించారు. ఫార్మా పరిశ్రమలు పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడ్డాయని ప్రభుత్వ శాఖలే నివేది కలు ఇస్తే చర్యలు తీసుకోవటం లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పరిశ్రమలు వ్యర్థాలను బయటకు వదలకుండా ఇక్కడే శుద్ధి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేసుకోలేదని, ఇప్పటికైనా ఏర్పాటు చేయించాలని కోరారు. ఆందోళనలు జరగకుండా సీఐ రమేష్ బాబు బందోబస్తు నిర్వహించారు.
అదనపు కలెక్టర్ సీతారామారావు విలేకరులతో మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఇదిలా ఉండగా పోలేపల్లి సెజ్లో ఏర్పాటైన 19 పరిశ్రమలకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమమా లేక రానున్న రోజుల్లో ఏర్పాటు చేసే 73 పరిశ్రమల కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశారు. కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఆర్డీవో అనిల్, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ రవి, డిప్యూటీ జోనల్ మేనేజర్ శ్యాంసుందర్రెడ్డి, సీజీఎం వినోద్, ఈఎం ఏపీ మదన్మోహన్, ఏఈ లలిత్ తదితరులు పాల్గొన్నారు.