అనన్య న్యూస్, జడ్చర్ల: నియోజకవర్గం ప్రజలకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, ఎవరు అధైర్య పడొద్దని మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ జడ్చర్ల నియోజకవర్గ ప్రజలకు అన్ని వేళల అండగా ఉంటానని తెలిపారు. గురువారం జడ్చర్ల కల్వకుర్తి రోడ్డులోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించి నియోజకవర్గం ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని అన్నారు. ప్రజా తీర్పునకు కట్టుబడి కొత్త ప్రభుత్వానికి స్వాగతిస్తున్నామని, రాష్ట్రంలో బిఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా ఇచ్చారని దానిని పూర్తిగా అంగీకరిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో తెలిపిన ప్రకారం హామీలను నెరవేర్చాలని అన్నారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.