అనన్య న్యూస్, జడ్చర్ల: అర్హులందరికీ ఆరు గ్యారంటీల పథకాలు అందుతాయని అందుకే ప్రజా పాలన ద్వారా ప్రజా పాలన ద్వారా ఆరు గ్యారంటీ పథకాలు ప్రతి కుటుంబానికి అందాలని, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమాన్ని జడ్చర్ల మండలం మాచారం గ్రామంలో జిల్లా కలెక్టర్ రవి నాయక్, అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు లతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జడ్చర్ల నియోజకవర్గంలో ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం కింద ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించడం సంతోషకరమైన విషయమని, కొత్త ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరు గ్యారెంటీల పైనే మొదటి సంతకం చేశారని అన్నారు.
జనవరి 6వ తేదీ వరకు అభయ హస్తం గ్యారెంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని, ప్రజలకు సందేహాలు ఉంటే అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. అర్హతను బట్టి లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని ఎలాంటి పైరవీలకు అవకాశం లేదని స్పష్టం చేశారు. అనంతరం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో జ్యోతి, గ్రామ సర్పంచ్ రవీందర్ రెడ్డి, మండల విద్యాధికారిని మంజులాదేవి, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.