అనన్య న్యూస్, హైదరాబాద్: పటాన్ చెరు ఓఆర్ఆర్ పై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఘటనాస్థలిలోనే దుర్మరణం పాలయ్యారు. లాస్య నందిత కారు పటాన్ చెరు ఓఆర్ఆర్ పై ప్రమాదానికి గురైంది. అదుపు తప్పిన కారు రెయిలింగ్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్రగాయాలు అయ్యాయి. తక్షణమే అతన్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
లాస్య నందిత దివంగత నేత సాయన్న కుమారై. గతేడాది ఫిబ్రవరరి 19న నందిత తండ్రి సాయన్న మృతి చెందాడు. ఏడాది వ్యవధిలోనే తండ్రి సాయన్న, కుమారై నందిత మృతి చెందడంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నందిత ఎమ్మెల్యేగా గెలిచింది. గతంలోనూ నార్కట్ పల్లి వద్ద నందిత ప్రమాదానికి గురైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
లాస్య నందిత మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి స్పదించారు. చిన్న వయసులో దుర్మరణం చెందడం అత్యంత విషాదకరమని అన్నారు. లాస్య నందిత చిన్న వయసులోనే ప్రజామన్ననలు పొందిందని అన్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. లాస్య నందిత మరణం పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతాపం తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచి రోడ్డు ప్రమాదంలో ఆమె అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు. లాస్య కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని వెల్లడించారు. ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.
లాస్య నందిత మృతి పట్ల మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత మృతి చెందడం తనను కలచివేస్తోందని కేసీఆర్ విచారంం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని, వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారం క్రితమే లాస్యను పరామర్శించానని, ఇప్పుడు ఆమె లేకపోవడం విషాదకరమని వ్యాఖ్యానించారు. ఈ విషాదకరమైన కష్టకాలాన్ని తట్టుకునేలా ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులకు శక్తి చేకూరాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.