- తేదీ: 28 నుంచి జనవరి 6 వరకు అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ..
- రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ..
అనన్య న్యూస్, హైదరాబాద్: ప్రతి పేదవారికి సంక్షేమం, సహాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, తండాలు, మారుమూల పల్లెల్లో ఉన్న అత్యంత నిరుపేదలకు సహాయం అందించేందుకు ఈ ప్రజాపాలన సభలు నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి ప్రజాపాలన లోగోను, అభయ హస్తం పథకాల దరఖాస్తు ఫారంను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.
ఈ నెల 28 నుంచి జనవరి 6వరకు నిర్వహించే ప్రజాపాలన గ్రామ, పట్టణ వార్డు సభల్లో ప్రజలు అభయ హస్తంలోని అభయ హస్తం ఆరు గ్యారంటీలకు దరఖాస్తు చేసుకోవచ్చని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, రైతు భరోసా పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లుగా తెలిపారు. ప్రజలకు ముందే దరఖాస్తు ఫారాలు పంపించి , దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు సూచించామన్నారు. కలెక్టరేట్‌లకు, ప్రజాభవన్ ప్రజావాణికి రాకపోకల ఖర్చులు భరించి వచ్చి పథకాల కోసం దరఖాస్తులు చేయడం అందరికి సాధ్యం కాదని అందుకే ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటకు ప్రజాపాలన సభల ద్వారా పంపిస్తున్నామన్నారు. ఇంతకాలం గడిల మధ్య సాగిన పాలనను ఇప్పుడు ప్రజలకు ముందుకు తెస్తామన్న మాట మేరకు ప్రజాపాలన సభలు నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు.
ప్రతి మండల అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి ఒక్కో బృందం రోజుకు రెండు గ్రామ, పట్టణ, వార్డు సభలు నిర్వహిస్తుందన్నారు. జనవరి 7లోగా వచ్చిన దరఖాస్తులను అనుసరించి పథకాల అమలులో ప్రణాళిక రూపొందించుకుని లబ్ధిదారుల ఎంపిక చేపట్టి అర్హులైన అందరికి ఆరు గ్యారంటీలు అందిస్తామన్నారు. జనభా ఎక్కువ ఉన్న గ్రామాల్లో అదనపు కౌంటర్ల ద్వారా దరఖాస్తులు తీసుకుంటామన్నారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా నిర్వహిస్తామన్నారు. తెల్ల రేషన్ కార్డు ప్రమాణికంగా పథకాల అమలు చేపడుతామని ఇందులో రేషన్ కార్డు లేదని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిరంతరంగా రేషన్ కార్డు జారీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
రైతుబంధుకు ఎలాంటి పరిమితి పెట్టలేదు:
రైతు బంధుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి పరిమితి విదించలేదని, ఆలస్యమైనా అందరికి రైతుబంధు నిధులు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మేడిగడ్డకు సంబంధించి న్యాయ విచారణ జరుగుతోందని, విచారణ తర్వాత ఎల్ అండ్ టీ, అధికారుల పాత్ర ఏమిటనేది తేలుతుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతమైందన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్ల పరిస్థితిని ముందే ఊహించామని, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందజేసి ఆదుకుంటామన్నారు. నిధులు దుర్వినియోగం కాకుండా చూస్తే పథకాలకు ఆ నిధులు ఉపయోగపడుతాయన్నారు.
ఏడాదిలోగా 2లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాం టీఎస్పీఎస్సీ చైర్మన్ లేకుండా పరీక్షల ప్రక్రియ జరగదని, టీఎస్ పీఎస్సీ సభ్యులు ఇప్పటికే రాజీనామాలు సమర్పించారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గవర్నర్ నిర్ణయం తీసుకున్నాక కొత్త బోర్డును ఏర్పాటు చేసి చైర్మన్, సభ్యులను నియమిస్తామని, అనంతరం ఉద్యోగ నియామకాలు చేపడతామన్నారు. గ్రూప్-2 పరీక్షలపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.