- ఆధారాలు చూపించకుంటే నగదు సీజ్..
- బంగారు, వెండి ఆభరణాలైన అంతే..
- రాష్ట్రవ్యాప్తంగా చెక్ పోస్టులు, తనిఖీలు..
అనన్య న్యూస్, హైదరాబాద్: ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పోలీసుల తనిఖీలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. వివాహాది శుభకార్యాలకు వస్తువులు కొనుగోలు చేసేందుకు నగదును తీసుకుని వెళ్లేందుకు జంకుతున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో విస్కృతంగా వాహనాల తనిఖీలు చేపట్టాని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. తనిఖీల్లో భాగంగా పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు, బైక్‌లపై వెళ్తున్న వారిని కూడా వదలడంలేదు, వారి వద్ద లభిస్తున్న తక్కువ డబ్బులకు కూడా ఆధారాలు చూపించాలని కోరడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.
ఎన్నికల నిబంధనలో భాగంగా ఎవరైనా రూ.50,000లకు మించి నగదు తీసుకుని వెళ్లరాదని పోలీసులు ఆదేశించారు. అంతకుమించి నగదు తీసుకుని వెళ్తే వాటికి ఆధారాలు చూపించాలని లేకుంటే నగదు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు సీజ్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఆధారాలు చూపించని నగదును ఇన్‌కం ట్యాక్స్ అధికారులకు అప్పగిస్తామని, వారికి ఆధారాలు చూపించి నగదును తీసుకుని వెళ్లాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఒక వేళా నగదుకు ఆధారాలు చూపించకుంటే ఇన్‌కం ట్యాక్స్ అధికారులు కేసులు నమోదు చేస్తారని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి నిబంధనలు విధించడం వల్ల ఎన్నికల్లో డబ్బులు ప్రభావం తగ్గించడం దేవుడెరుగు, తాము మాత్రం ఇబ్బందులు పడుతున్నామని సామాన్యలు గగ్గోలు పెడుతున్నారు.