- ఎవరితో పోరాడుతున్నామో మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి..
అనన్య న్యూస్, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఎలా ఇచ్చిందో అదే విధంగా రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఆరు వాగ్దానాలను అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఎవరూ డిస్టర్బ్ చేయలేరు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్న విషయం మీరు గమనించాలి. రాజకీయాల్లో మనం ఎవరితో పోరాడుతున్నామో మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి. ఏ శక్తులైతే మనకు వ్యతిరేకంగా నిలబడ్డాయో వారి గురించి తెలుసుకోవాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కేవలం బీఆర్ఎస్తోనే కొట్లాడడం లేదు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంతో పోరాటం చేస్తోంది. ఇవన్నీ వేర్వేరు పార్టీలుగా కనిపించినా, తెలంగాణలో అన్నీ కలిసిపోయాయి.
నేను లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలను చూశాను. పార్లమెంట్లో బీజేపీపి అవసరం ఉన్నప్పుడల్లా బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలిపారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు తెలిపింది. జీఎస్టీకి సపోర్టు ఇచ్చింది. ఎప్పుడూ బీజేపీకి అవసరం పడితే అప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ సపోర్టుగా నిలుస్తోంది. ఈ రోజు కాంగ్రెస్ మీటింగ్ పెట్టామని వాళ్లు ముగ్గురు కూడా వేర్వేరేరు మీటింగ్లు పెట్టాయి. సోనియా గాంధీ గారు మాట ఇస్తే తప్పనిసరిగా మాట నిలబెట్టుకుంటారు. ఏమి జరిగినా, ఎంత నష్టపోయినా సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. 2012లో సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఆలోచిస్తామని చెప్పారు. ఆ తర్వాత ఆ మాట నిలబెట్టుకున్నారు.
మీ కల, మీ ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారు. ఇక్కడ మొత్తం అన్ని లాభాలు కూడా ముఖ్యమంత్రి కుటుంబానికే దక్కుతున్నాయి. మేము తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబానికి ఇవ్వలేదు. వారి లాభాల కోసం ఇవ్వలేదు. పేదల కోసం, రైతుల కోసం, బలహీన వర్గాల కోసం, మహిళల కోసం ఏర్పాటు చేశాం. మేము అప్పడు తెలంగాణ విషయంలో గ్యారెంటీ ఇచ్చాం.. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి విషయంలో కూడా అదే గ్యారెంటీ ఇస్తున్నాం.. సోనియా మాటలు నమ్మండి.. ఆదరించండి అని రాహుల్ గాధీ అన్నారు.