అనన్య న్యూస్, హైదరాబాద్: బ్రిటీష్ బానిస బంధాల్లో చిక్కుకుని భారతజాతి నలిగిపోతున్న వేళ విప్లవజ్యోతి అయి అవతరించిన వీర యోధుడు మన అల్లూరి సీతారామరాజు అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు. అన్నెంపున్నెం ఎరుగనటువంటి మన్యం బిడ్డల కన్నీరు తుడిచి, గడ్డిపరకలను గడ్డపారలుగా మార్చిన మహాయోధుడు మన అల్లూరి అని కొనియాడారు. ఆయన భారతమాత గర్వించేటటువంటి ఉత్తమ తనయుడు, నిర్మల దేశభక్తుడు, నిజమైన యోగి పుంగవుడు అల్లూరి అని కేసీఆర్ పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను మంగళవారం గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రసంగించారు.
ఆ మహానీయుడి 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం యావత్ జాతి కర్తవ్యం అని కేసీఆర్ తెలిపారు. ఈ కర్తవ్యాన్ని భక్తిశ్రద్ధలతో నిష్ఠతో నిర్వహించిన క్షత్రియ సేవా సమితిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఈ ఉత్సవాలు అల్లూరి సీతారామరాజు పోరాట చైతన్యాన్ని, దేశభక్తిని కొత్త తరానికి ఘనంగా చాటిచెబుతాయని నేను విశ్వసిస్తున్నాను. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ఈ ఉత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించడం చాలా సముచితం. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం, నేను పాల్గొనడం జరిగింది అని కేసీఆర్ పేర్కొన్నారు.