- 2023నీ మించి ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం..
అనన్య న్యూస్, హైదరాబాద్: ఇంతకుముందు ప్రపంచంలో అత్యంత వేడి సంవత్సరం ఏది అంటే 2016 గురించి చెప్పుకొనేవారు. ఇప్పుడు 2023 దాని రికార్డును బద్దలుకొట్టింది. మానవాళి చరిత్రలోనే ఇప్పటివరకు అత్యంత వేడి సంవత్సరంగా నిలిచింది. పారిశ్రామిక యుగానికి ముందునాటి కంటే 2023లో సగటు ఉష్ణోగ్రత ఏకంగా 1.54 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. అదే నాసా, నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఎఎఎ) లాంటి సంస్థలైతే 1.37, 1.34 డిగ్రీల సెల్సియస్ పెరిగినట్లు చెప్పాయి. ఏది ఏమైనా కూడా ఇంత ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల అనేక ఉత్పాతాలు సంభవిస్తాయన్నది పర్యావరణ వేత్తల ఆందోళన. గత సంవత్సరం జూన్ నెలలో ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవగా, జూలై 6 అత్యంత వేడిగా ఉన్న రోజుగా నిలిచింది. ఇక 2024 మరింత వేడిగా ఉండబోతోందని, దీనివల్ల కలిగే దుష్ప్రభావాలను భరించడానికి మానవాళి సిద్ధంగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఎల్ నినో సహా.. ఎన్నో కారణాలు: ఉష్ణోగ్రతలు పెరగడానికి ఎన్నో కారణాలుంటాయి. వాటిలో దాదాపు 10 నుంచి 12 నెలల వరకు కొనసాగే ఎల్ నినో కూడా ఒకటి. దీనివల్ల 2023 కంటే 2024 సంవత్సరం ఇంకా వేడిగా ఉంటుందన్నది శాస్త్రవేత్తల అంచనా. 2023 జూలై చివరిలో ఎల్ నినో ప్రారంభమైంది. అంటే అది 2024 మే లేదా జూన్ వరకు ఉండొచ్చు. 2023లో మాత్రం ఎల్ నినో ఒక్కటే కాకుండ కార్బన్ డయాక్సైడ్ మీథేన్ లాంటి గ్రీన్ హౌస్ వాయువులు తరచు వెలువడటంతో భూతాపం అంటే ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగిపోయింది. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటాయి. జూలై 16న కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో ఉష్ణోగ్రత 53.5 డిగ్రీలకు చేరుకోగా, జూలై 17న చైనాలోని సన్ బావో 52.5 డిగ్రీలకు చేరింది. మన దేశంలో కూడా చాలా ప్రాంతాల్లో 50-52 డిగ్రీల స్థాయిని దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే వాటిలో ఎన్నింటిని అధికారికంగా ప్రకటించారన్నది మాత్రం ఇప్పటికీ అనుమానమే. 2023 జూలై నెలలో అనూహ్యంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో అమెరికా, చైనా, జపాన్ లాంటి పలు దేశాల్లో వడగాలుల తీవ్రత బాగా పెరిగింది.
దారుణ ప్రభావాలు: భూతాపం లేదా ఉష్ణోగ్రత పెరగడం వల్ల వడగాలులతో పాటు కరవు, కార్చిచ్చులు, వరదలు, బలమైన గాలులు, సముద్ర తుపానుల్లాంటి అనేక రకాల ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి. సగటు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెల్సియస్ పెరిగితే వడగాలులు ఐదు రెట్లు, కార్చిచ్చులు అనేక రెట్లు పెరుగుతాయి. ఉష్ణోగ్రత పెరగడం, వడగాలులు, కార్చిచ్చుల్లాంటి ప్రభావలు సముద్ర ఉపరితల నీటి ఉష్ణోగ్రత పెరుగుదలకు కారణం అవుతాయి. మహా సముద్రాలు వాతావరణం నుంచి అదనపు వేడిని గ్రహిస్తాయి కాబట్టి, 2023లో ప్రపంచంలోని అన్ని మహా సముద్రాలు మునుపటి సంవత్సరం కంటే వేడిగా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ, సముద్ర మట్టం కూడా పెరుగుతుంది, తీర కోత, వరదల ప్రమాదాన్ని పెంచుతుంది.