అనన్య న్యూస్, హైదరాబాద్: సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. అంతటి ముఖ్యమైన కళ్లు సరిగ్గా కనిపించకపోవడం వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతుంటారని మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని సరోజినీదేవి కంటి దవాఖానలో ఫ్యాకో మెషీన్లను మంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. సరోజినిదేవి ఆస్పత్రిలో రెండు ఫ్యాకో యంత్రాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. రెండోవ ఫేజ్ కంటి వెలుగులో 40 లక్షల మంది అద్దాలు ఇచ్చామన్నారు.
ఫ్యాకో యంత్రాలతో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉండదని, ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. త్వరలోనే సరోజిని ఆస్పత్రిలో న్యూబ్లాక్ నిర్మాణం జరుగుతోందని హరీష్ రావు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 ఫ్యాకో యంత్రాలను ఏర్పాటు చేశామని, వీటన్నింటినీ ఇప్పుడు ఒకేసారి ప్రారంభించుకున్నామని, ఒక్కో ఫ్యాకో యంత్రం ఖరీదు రూ.28.85 లక్షలు అనీ, మొత్తంగా 12 యంత్రాలకు కలిపి ప్రభుత్వం రూ.3.46 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు.