అనన్య న్యూస్, హైదరాబాద్: పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరుకు ఈఏసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై సీఎం కేసీఆర్ గురువారం హర్షం వ్యక్తం చేశారు. పథకం తొలిదశ పనులు తుది దశకు చేరుకొన్న తరుణంలో పర్యావరణ అనుమతులు సైతం మంజూరు కావడంపై ఆనందం వ్యక్తం చేశారు.
ఈఏసీ రాకతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే రెండో దశ పనులు కూడా చకచకా ముందుకు సాగే అవకాశం ఏర్పడిందని సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నో కేసులను ఎదుర్కొని, మరెన్నో అడ్డంకులను అధిగమించి అనుమతులు సాధించామని, ఇది తెలంగాణ సాధించిన మరో అద్భుత, చారిత్రక విజయమని సీఎం కేసీఆర్ అభివర్ణించారు.
ప్రాజెక్టుల నిర్మాణమే కాకుండా, అనుమతుల సాధనలోనూ తెలంగాణ ప్రభుత్వం మరోసారి సాటిలేదని నిరూపించుకొన్నదని తెలిపారు.ఇది తెలంగాణ సర్కారు సంకల్పానికి నిలువెత్తు నిదర్శమని పేర్కొన్నారు. కృష్ణమ్మ నీళ్లను తెచ్చి పాలమూరు బిడ్డల పాదాలు కడిగే రోజు ఆసన్న మైనదని తెలిపారు. పాలమూరుకు పర్యావరణ అనుమతుల సాధనకు కృషి చేసిన సాగునీటిశాఖ ఇంజినీరింగ్ అధికారులను అభినందించారు.