అనన్య న్యూస్, హైదరాబాద్: ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ కి చెరుకు సరఫరా చేసిన రైతులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు, రాష్ట్ర షుగర్ కేన్ కమిషనర్, జిల్లా కలెక్టర్ శరత్, ఎస్పీ రమణ కుమార్ తో కలిసి పెండింగ్ బిల్లులపై సమీక్ష నిర్వహించారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని కొత్తూరు గ్రామంలో ఉన్న ట్రైడెంట్ చెక్కర ఫ్యాక్టరీ యజమాన్యం గత సీజన్లో చెరుకు సరఫరా చేసిన రైతులకు రూ. 12.05 కోట్లు చెల్లించవలసి ఉందన్నారు. జూన్ 25 లోగా చెల్లిస్తామని గతంలో యజమాన్యం హామీ ఇచ్చిన ఇంతవరకు డబ్బులు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉద్యోగులకు ఇవ్వవలసిన పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని సూచించారు. రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించకపోతే రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం ఫ్యాక్టరీ ఆస్తులు వేలం వేసి రైతులకు పెండింగ్ బకాయిలు చెల్లిస్తామన్నారు.
చెరుకు రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఫ్యాక్టరీ లైసెన్స్ రద్దుచేసి జోన్ ను ఎత్తివేస్తామని హెచ్చరించారు. ఎప్పుడు బిల్లులు చెల్లిస్తారు, లిఖితపూర్వకంగా ఇవ్వాలని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ , డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, సంగారెడ్డి జిల్లా షుగర్ కేన్ అధికారి రాజశేఖర్, ఆర్డీవో వెంకట్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు