- మన కోసం శ్రమించే నిస్వార్థ జీవి నాన్న..
- నేడు (ఫాదర్స్ డే) పితృ దినోత్సవం..
అనన్య న్యూస్: మన కోసం శ్రమించే నిస్వార్థ జీవి నాన్న.. తనలోని బాధని మనకు తెలియనీయకుండా తనలోనే దాచుకునే నిస్వార్థపరుడు.. అలాంటి తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడే. మనం ఎగిరే గాలిపటం.. మనల్ని ఎగిరేసిది అమ్మ.. ఆ రెండింటి మధ్య దారం ఉంటుంది. అది కనిపించదు. నాన్న ప్రేమ కూడా అంతే.. దారంలాంటిదే.. చూసేవారికి కనిపించదు..
పిల్లల్ని నవమాసాలు మోసేది తల్లి అయితే జీవితాంతం తన గుండెలపై మోసేవాడు తండ్రి అని అంటారు. అయిన ఈ సమాజంలో తల్లికి ఉన్నంత గుర్తింపు తండ్రికి ఉండదని, కవిత్వాల నుంచి సినిమాల వరకు తల్లుల్ని కీర్తించినంతగా తండ్రుల పాత్రను గుర్తించరన్న వాదన ఎప్పట్నుంచో ఉంది. నాన్నల్ని, వారి త్యాగాలను గుర్చించడానికి ఓ రోజు ఉంది. అదే ఫాదర్స్ డే. అంటే పితృ దినోత్సవం. ప్రతీ ఏటా మాతృ దినోత్సవం జరుపుకొన్నట్టే తండ్రుల కోసం ప్రత్యేకంగా ఓ రోజును సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కుటుంబంలో, సమాజంలో తండ్రి పాత్రను గుర్తించేందుకు ప్రతీ సంవత్సరం జూన్ మాసంలో మూడో ఆదివారాన్ని ఫాదర్స్‌డే గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈసారి జూన్ 16న ఫాదర్స్ డే వచ్చింది. మరి ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకునే ఆనవాయితీ ఎలా మొదలైందో తెలుసుకోండి.
ఫాదర్స్ డేను మొదటిసారిగా అమెరికాలో సెలబ్రేట్ చేశారు. 1910 జూన్ మూడో ఆదివారం నాడు వాషింగ్టన్ వైఎంసీఏలోని స్పోకేన్‌లో సోనోరా స్మార్ట్ డాడ్ ఫాదర్స్ డే సెలబ్రేట్ చేశారు. అప్పుడు జూన్ 19న ఫాదర్స్ డే వచ్చింది. అయితే అప్పటికే ఏటేటా మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న సోనోరా స్మార్ట్ డాడ్ తండ్రులకు కూడా ఓ రోజు ఉండాలని భావించారామె. సోనోరా తండ్రి పేరు విల్లియం జాక్సన్ స్మార్ట్. ఆరుగురు పిల్లలకు తండ్రి. కష్టపడి ఆరుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. తన తండ్రి కష్టాలను, బాధ్యతల్ని దగ్గర్నుంచి చూసిన సోనోరా ఫాదర్స్ డే ఉండాల్సిందే అనుకున్నారు. అలా ప్రతీ ఏడాది జూన్ 3వ ఆదివారం పితృ దినోత్సవం (ఫాదర్స్ డే) జరుపుకొనే ఆనవాయితీ అమెరికాలో ప్రారంభమైంది. ఆ తర్వాత ఇతర దేశాల్లోనూ ఇదే రోజున పితృ దినోత్సవాన్ని ( ఫాదర్స్ డే) జరుపుకొంటున్నారు. కొన్నేళ్లుగా భారతదేశంలో కూడా ఫాదర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. నాన్న చేసే త్యాగాలకి ప్రతీకగానే ఆయనికి ఓ రోజుని అంకితం చేస్తున్నాం. మరి అలాంటి నాన్నలందరికీ హ్యాపీ ఫాదర్స్ డే..