అనన్య న్యూస్, హైదరాబాద్: గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు టీఎస్‌పీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. 33 జిల్లా కేంద్రాల్లోని 994 సెంటర్లలో జూన్ 11న ఆదివారం ఈ పరీక్ష జరగనున్నది. గతంలో ఈ ప్రశ్నాపత్రాలు లీక్ అవడంతో ఈసారి పటిష్ట ప్రణాళికతో పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తున్నది. దీని కోసం ఇప్పటికే పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించింది. కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో సమావేశాలు జరిపింది. ఈసారి ఈ పరీక్షలకు అథారిటీ ఆఫీసర్లుగా కలెక్టర్లను, చీఫ్ కో-ఆర్డినేటర్లుగా సబ్ కలెక్టర్లను నియమించింది. పరీక్షా కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్లుగా వ్యవహరించే 1,995 మందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించింది.
వారితో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్, పరీక్షల విభాగం ప్రత్యేకాధికారి బీఎల్ సంతోష్ శుక్రవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లు, పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేకంగా చర్చించారు. మొత్తం 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిరుడు ఏప్రిల్ 26న నోటిఫికేషన్ జారీచేసిన టీఎస్‌పీఎస్సీ అక్టోబర్ 16న పరీక్ష నిర్వహించింది. ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న మొత్తం 3,80,032 మందిని ఆదివారం మళ్లీ పరీక్ష రాసేందుకు అనుమతించనున్నారు. కాగా శుక్రవారం అర్ధరాత్రి వరకు 2,85,000 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకొన్నారు.
నిబంధనలు కఠినతరం:
ఈసారి ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నారు. జంబ్లింగ్ విధానంలో ప్రశ్నలు రూపొందించారు. పరీక్షకు 15 రోజుల ముందే నమూనా పత్రాన్ని వెబ్‌సైట్‌లో ఉంచారు. అభ్యర్థులు బూట్లు వేసుకుని పరీక్షకు రాకూడదని, చెప్పులు మాత్రమే ధరించాలని కమిషన్ స్పష్టం చేసింది. హాల్‌టికెట్‌లో ఫొటో సరిగా లేకపోతే అభ్యర్థులు చివరి నిమిషంలో ఇబ్బం ది పడే ప్రమాదం ఉన్నదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 3 పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి తీసుకురావాలని తెలిపింది. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తామని ప్రకటించింది.