అనన్య న్యూస్, గద్వాల: నిజాం రాజ్య పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఉద్యమాన్ని నడిపిన గొప్ప పోరాటయోధుడు పండుగ సాయన్న అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం గద్వాల మండలం జిల్లేడబండ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పండుగ సాయన్న విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూస్వాములు రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి పేదలను ఆదుకున్న దేవుడు పండుగ సాయన్న అని, పండుగ సాయన్న ఆనాటి బహుజనులలో ఉన్న పేదల అందరి కోసం పోరాటం చేసిన మహనీయుడని కొనియాడారు. నిజాం నిరంకుశ పాలనకు ఎదురు తిరిగి పోరాడి ఎందరో పేదల ఆకలి తీర్చిన మహానుభావుడని అన్నారు. పండుగ సాయన్న విగ్రహాం ఏర్పాటుతో భవిష్యత్ తరాలు ఆయన చరిత్రను తెలుసుకొనే అవకాశం ఏర్పడిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు నాయకులను సత్కరించారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, నాయకులు గడ్డం కృష్ణా రెడ్డి, సుభాన్, శ్రీధర్ గౌడ్, పటేల్ ప్రభాకర్ రెడ్డి, రమేష్ నాయుడు, ప్రభాకర్ రెడ్డి, రాజారెడ్డి, గోవిందు, రాముడు, రమేష్ రెడ్డి పాల్గొన్నారు.