అనన్య న్యూస్, న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రజాగాయకుడు గద్దర్ నాయకత్వంలో మరో రాజకీయ పార్టీ తెరపైకి వచ్చింది. గద్దర్ ప్రజా పార్టీ పేరుతో నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని గద్దర్ నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ఆయన కలిశారు. గద్దర్ ప్రజా పార్టీ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. నెలరోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికానుంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో సమావేశానికి ముందు ఏపీ తెలంగాణ భవన్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద గద్దర్ నివాళులర్పించారు.
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అనంతరం గద్దర్ మీడియాతో మాట్లాడుతూ నేను ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. బంగారు తెలంగాణ కాలేదు, పుచ్చిపోయిన తెలంగాణ చేశారు. పదేళ్ల తెలంగాణలో ప్రజలు కోరుకున్న పరిపాలన అందలేదు. దొరల పరిపాలన జరుగుతోంది. 77 ఏళ్ల వయసులో దోపిడీ పార్టీ పోవాలని ప్రజా పార్టీ పెట్టాను. భారత రాజ్యాంగం తీసుకొని ఓట్ల యుద్ధానికి సిద్ధం కావాలి. ఓటును బ్లాక్ మనీ నుంచి బయటకు తేవాలి. ఇప్పటి వరకు అజ్ఞాతవాసం నుంచి ప్రజలను చైతన్యం చేశా. ఇక నుంచి పార్లమెంటరీ పంథాను నమ్ముకుని బయలుదేరా.
ఇది శాంతి యుద్ధం ఓట్ల యుద్ధం. పార్టీ నిర్మాణం కోసం గ్రామ గ్రామానికి వెళ్తా. సచ్చే ముందు సత్యమే చెపుతున్నా. నేను భావ విప్లవకారుడిని, అయిదేళ్ళ అడవిలో ఉన్న. ప్రజలకు స్వేచ్ఛ కావాలి నీరు, ఉద్యోగాలు, కావాలి అని గద్దర్ పేర్కొన్నారు. గద్దర్ తో పాటు మీడియా సమావేశంలో గద్దర్ ప్రజా పార్టీ జనరల్ సెక్రటరీ నగేష్, నేషనల్ మీడియా కో ఆర్డినేటర్ ఎ. రాజేష్, అడ్వకేట్ విజయ్ పాల్గొన్నారు.