- కష్టకాలంలో తోడుంటూ.. నేనున్నా నంటూ ముందుకు నడిపే వాడే స్నేహితుడు..
- ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం..
నీ.. స్నేహం.. భాష లేని ఓ బంధం. ఆత్మీయతకు ప్రతిరూపం స్నేహం. సృష్టిలోనే అతి మధురం స్నేహం. ఆపదలో బంధువుడిలా వెన్నంటి ఉంటూ.. ప్రోత్సహించేది, షరతులు లేనిది, కులాలు వేరయిన, మతాలు వేరయిన, భాషలు వేరయిన, భావాలు వేరయిన జీవితాంతం ముందుకు నడిపేది, కష్టకాలంలో తోడుంటూ.. ‘నేనున్నా’ నంటూ ముందుకు నడిపేవాడే స్నేహితుడు. ఎక్కడ మొదలవుతుందో తెలియదు.. కానీ చిరకాలం నీ వెంట ఉంటుంది స్నేహం. తల్లిదండ్రులకు తెలియని విషయాలు కూడ స్నేహితుడికి తెలుస్తాయంటే అది కేవలం స్నేహానికున్న గొప్పతనమే. అలాంటి స్నేహితుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టులో వచ్చే మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము.
అనన్య న్యూస్: ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటారు. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహించు కోవాలని యుఎన్ఓ ప్రకటించింది. హాల్ మార్క్ కార్డ్ వ్యవస్థాపకుడు జాయిస్ హాల్ 1958లో మొదటి సారి స్నేహితుల దినోత్సవం జరుపుకోవాలని ప్రస్తావించాడు. అప్పటి నుంచి స్నేహితులందరూ అందరూ గ్రీటింగ్ కార్డులు, శుభాకాంక్షలు చెప్పు కోవడం ప్రారంభించారు. ఆ తర్వాతే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ గ్రీటింగ్ కార్డుల సంస్థ స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహించడం మొదలు పెట్టిందని చెబుతారు.
మరి కొం తమంది….స్నేహం అనే గొప్ప అనుభూతిని సంబురంగా మార్చుకోవాలన్న ఆలోచనలోంచి పుట్టిందే స్నేహితుల రోజని, 1998లో యునైటెడ్ స్టేట్స్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆగష్టు మొదటి ఆదివారాన్ని జాతీయ స్నేహితుల రోజుగా ప్రకటించింది. ఈ ఆనవాయితీని ప్రపంచం అంతా కొనసాగిస్తోందని మరికొందరు చెబుతారు.
ఎలా మొదలైనా, ఎవరు ప్రారంభించినారన్నది పక్కన పెడితే స్నేహితుల దినోత్సవం మాత్రం స్నేహితులందరికీ ఆనందాన్ని నింపుతున్నది నిజం.