- పదేళ్లలో 15లక్షల ఉద్యోగావకాశాలు: మంత్రి కేటీఆర్
అనన్య న్యూస్, రంగారెడ్డి: రాష్ట్రానికి మరో అంతర్జాతీయ పరిశ్రమ తరలివచ్చింది. ఎలక్ర్టానిక్స్, సెల్‌ఫోన్ తయారీ రంగంలో అతిపెద్ద సంస్థగా పేరొందిన తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ రాష్ట్రంలో యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా సోమవారం ఫాక్స్‌కాన్ సంస్థ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతి నిధులతో కలిసి మంత్రి భూమిపూజ నిర్వహించారు. రూ.1,655 కోట్ల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్ గ్రామంలో ఫాక్స్‌కాన్ సంస్థ ఏర్పాటు కానుంది. ఫాక్స్‌కాన్ పరిశ్రమలో 35 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ సంస్థ కోసం కొంగరకలాన్‌లో జిల్లా కలక్టరేట్ సమీపంలో సర్వే నెంబర్ 300లో రాష్ట్ర ప్రభుత్వం 196 ఎకరాల భూమిని కేటాయించింది.
మంత్రి మాట్లాడుతూ ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. మరో 10 ఏళ్లలో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు ప్రకటించారు. ఒప్పందం కుదిరిన రెండున్నర నెలల్లోనే శంకుస్థాపన చేశామని చెప్పుకొచ్చారు. మొదటి దశలో 25 వేల ఉద్యోగాలు రానున్నాయన్నారు. యువత కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్ లియా పాల్గొన్నారు.