అనన్య న్యూస్: తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఏ క్షణమైనా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల వేడి మొదలైంది. పార్టీలన్నీ గెలుపు కోసం ప్రణాళికలు రూపొందించు కుంటున్నాయి. అభ్యర్థులను ఖరారు చేసుకోవడంతో పాటు ప్రచారాన్ని మొదలు పెట్టేందుకు సిద్ధమవు తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తుందా అని పార్టీలతో పాటు ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే ఈసీ ఏర్పాటు మొదలుపెట్టడం, తుది జాబితా విడుదల చేయడంతో ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ రానుందని తెలుస్తోంది.
తెలంగాణతో పాటుగా ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్త మవుతోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఈ నెల 8-10 తేదీల మధ్య వెలువడుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ నెల 9న కచ్చితంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని ఆ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల ఎన్నికల పరిశీలకులతో ఎన్నికల సంఘం శుక్రవారం భేటీ అయింది. అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయా రాష్ట్రాల్లో సమీక్షలు నిర్వహించిన ఈసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.
తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఇటీవల మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. నాలుగు రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని, చత్తీస్‌గఢ్‌లో రెండు విడతలుగా పోలింగ్ ని ర్వహించాలని ఎన్నికల సంఘం బావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణతో పాటుగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాంలలోఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని ఇసి భావిస్తోంది.
పోలింగ్ ప్రక్రియ నవంబర్ రెండో వారంనుంచి డిసెంబర్ మొదటి వారం వరకు కొనసాగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. కాగా డిసెంబర్ 10-15 తేదీల మధ్య ఓట్ల లెక్కింపు జరపాలని ఈసీ భావిస్తోంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీల పదవీకాలం వచ్చే ఏడాది జనవరిలో ముగియనుండగా, మిజోరీం శాసనసభ పదవీ కాలం ఈఏడాది డిసెంబర్ 17తో ముగుస్తుంది. మిజోరాంలో మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉండగా, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ పార్టీ, మధ్యప్రదేశ్‌లో బిజెపి అధికారంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) అధికారంలో ఉంది.