అనన్య న్యూస్, ఆసిఫాబాద్: పోడు భూముల కోసం పోరాటం చేసిన సందర్భంగా ఆదివాసి గిరిజన రైతులపై నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. చట్టపరంగా ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను తక్షణం ప్రారంభించాలని సీఎస్ శాంతికు మారి, డీజీపీ అంజనీకుమార్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ భవన సముదాయాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం పోడు భూములకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ మారుమూలన ఉన్నఆదివాసి గిరిజన ఆవాసాలకూ త్రీ ఫేజ్ కరెంటు సరఫరా చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశిస్తున్నట్టు తెలిపారు. తాము పంపిణీ చేసిన భూముల్లో గిరి వికాసం కింద బోర్లు వేసుకొని పంటలు సాగు చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు.
మారుమూలన ఉన్న ఆసిఫాబాద్ జిల్లా అవుతుందని ఎవరూ అనుకోలేదని, అద్భుతమైన జిల్లా కలెక్టర్ ఆఫీసును కూడా ఇవాళ ప్రారంభించుకున్నా మని, ప్రత్యేక శ్రద్ధతో అందమైన భవనాన్ని నిర్మించిన రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఆసిఫాబాద్ కు మెడికల్ కాలేజీ వస్తుందని ఎవరూ అనుకో లేదని, ఇక్కడ మెడికల్ కాలేజీ భవనం సైతం నిర్మాణంలో ఉండటం గొప్ప విషయమని అన్నారు. అనేక రంగాల్లో తెలంగాణ నంబర్ వన్ గా నిలిచిందని సీఎం పేర్కొన్నారు. దాదాపు 35 ఏండ్ల పాటు కరెంటు కోసం ఎంతో కష్టపడ్డామని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. దేశంలో 24 గంటల పాటు కరెంటు సరఫరా చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. ఆసిఫాబాద్ లో వైద్య సౌక ర్యాలు మెరుగు పడ్డాయని, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సర్టిఫికేటే దీనికి నిదర్శనమన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల ప్రత్యేక చొరవతోనే ఇది సాధ్యమైందని అన్నారు.