అనన్య న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ అధికారం తమదేనని, ఇప్పటికంటే మరో ఎనిమిది సీట్లు ఎక్కువగానే గెలుస్తామని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం వర్షాకాల అసెంబ్లీ సమావేశాల చివరి రోజు సభలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, సాధించిన ప్రగతి పై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు రూపాయి ఇవ్వని కేంద్రం అవార్డులు మాత్రం బాగా ఇచ్చిందని ఎద్దేవా చేశారు. మన పునరావాస గ్రామాలు చూసి కేంద్ర బృందాలు ప్రశంసించాయన్నారు. దేశంలోనే అత్యుత్తమ పునరావాసాలు నిర్మించింది తెలంగాణయే అని కేసీఆర్ అన్నారు.
కృష్ణా ప్రాజెక్టులకు నీళ్లు రాకుంటే కాళేశ్వరం నుంచి తీసుకునేలా ప్రణాళికలు చేశామన్నారు. కాళేశ్వరం నుంచే తుంగతుర్తి, కోదాడ, డోర్నకల్ నీళ్లు వెళ్తున్నాయన్నారు. కాళేశ్వరం నిర్మించకుంటే కొత్తగా వేల ఎకరాలకు నీరు ఎక్కడ్నుంచి వస్తోందన్నారు. కరీంనగర్ జిల్లాలో 4 సజీవ జలధారలు కాళేశ్వరం వల్లే పారుతున్నాయన్నారు. కాలువల్లో ఏడాది పొడువునా నీళ్లు పారుతున్నాయన్నారు. పల్లె పట్టణాల్లో రూపాయికే నల్లా కలెక్షన్ ఇస్తున్నామని, ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల మంచినీళ్లు ఇస్తున్నామన్నారు. ప్రజల నుంచి రూపాయి తీసుకోకుండా ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తున్నామని, తండాలు గిరిజన ఆవాసాల్లో రోగాలు ఇప్పుడు కనిపిస్తున్నాయా అని కేసీఆర్ ప్రశ్నించారు.
ఎన్నో రాష్ట్రాలు, కొన్ని దేశాల ప్రతినిధులు వచ్చి మన మిషన్ భగీరథను అధ్యయనం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో 35 వేల చెరువులు అదృశ్యమయ్యాయన్నారు. తెలంగాణ వస్తే ముందుగా చెరువులనే బాగు చేసుకోవాలని నిర్ణయించామన్నారు. మిషన్ కాకతీయ అనే పేరును రాష్ట్ర ఆవిర్భావానికి ముందే నిర్ణయించామన్నారు. తలసరి ఆదాయం ఆధారంగా రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. తలసరి ఆదాయం విషయంలో పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు.
1956 లో ప్రజలు వ్యతిరేకిస్తున్నా లెక్కచేయకుండా ఆంధ్రరాష్ట్రంలో విలీనం చేశారని ఆసమయంలో ఇచ్చిన హామీలను విస్మరిస్తుంటే చూస్తూ కూర్చున్నది ఎవరు అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. అనేక ఒప్పందాలను కాలరాసినా కాంగ్రెస్ నేతలు ప్రేక్షకపాత్ర పోషించారని విమర్శించారు. 1969 ఉద్యమంలో ఎందరో విద్యార్థులు ప్రాణాలు పోయాయని ఆ తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ ఉక్కుపాదంతో అణచివేసిందన్నారు. తెలంగాణ ఉద్యమం 58 ఏళ్లు సాగడానికి కారణం ఎవరు ఉన్న తెలంగాణను ఊడగొట్టింది జవహర్ లాల్ నెహ్రూ కాదా అని సీఎం కేసీఆర్ నిలదీశారు.