అనన్య న్యూస్: అగ్రరాజ్యం అమెరికాలో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయగాథలను ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ వివరించారు. సోమవారం అమెరికా నెవాడా రాష్ట్రంలోని హెండర్సన్ జరుగుతున్న అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్ సదస్సులో కేటీఆర్ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా తాగు, సాగునీటి రంగంతో పాటు పలు రంగాల్లో సాధించిన విజయాలను అమెరికా ఇంజినీరింగ్ నిపుణులు, సామాజికవేత్తలు, పరిశ్రమవర్గాలకు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఎదుర్కొన్న కష్టాలు, పల్లం నుంచి ఎత్తుకు గోదావరి నదీ జలాలను ఎత్తిపోసేందుకు సీఎం కేసీఆరే ఇంజినీర్‌గా మారిన ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరానికి రూపకల్పన చేసిన తీరు, నాలుగేళ్లలోనే ప్రాజెక్టు పూర్తి చేసిన తీరుపై ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కాలువ నిర్మాణం, పంప్‌హౌస్‌లు, సర్జ్‌పూల్‌లు, ప్రాజెక్టులో వినియోగించిన స్టీల్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ప్రాజెక్టు నిర్మాణంతో దేశంలోనే వరిసాగులో రెండోస్థానానికి చేరిన తీరును వివరించారు. తెలంగాణవ్యాప్తంగా తాగునీటి కష్టాలను తీర్చేందుకు చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టు, దాంతో వందశాతం ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నట్లు ప్రజెంటేషన్ ద్వారా తెలిపారు.