- శ్వాస తీసుకోలేక పోయిన బాలికలు..
- అంబులెన్సులు, లారీల్లో, ఆటోలో ఆసుపత్రికి తరలింపు..
అనన్య న్యూస్, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులో గల గిరిజన బాలికల హాస్టల్ లో విద్యార్థులు గురువారం అస్వస్థకు గురయ్యారు. స్థానికులు, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం హాస్టల్ లో 450 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులు గురువారం సాయంత్రం హాస్టల్ లో అన్నం తిన్న తర్వాత సుమారు 45 మందికి శ్వాస ఆడక ఇబ్బంది పడ్డారు. వారిని తోటి విద్యార్థులు గ్రామంలోని పీహెచ్ సీకి చేర్చే ప్రయత్నం చేశారు. విషయాన్ని గమనించిన గ్రామస్తులు కొంతమంది. విద్యార్థులను బైకులపై, పరిస్థితి విషమంగా ఉన్నవారిని 108 వాహనాల ద్వారా మొత్తం సుమారు 45 మందిని అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మరి కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో అంబు లెన్సులు అందుబాటులో లేకపోవడంతో గ్రామ సర్పంచ్ శ్రీరామ్ నాయక్, ఎంపీటీసీ దాసరి శ్రీనివాసులు ఒక ప్రైవేటు లారీలో సుమారు మరో 200 మందిని అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని నాగర్ కర్నూల్ జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా వైద్యులు డాక్టర్ సుధాకర్, నర్సులు కలిసి హాస్టల్ లోనే మరికొంతమందికి చికిత్సను అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన విద్యా ర్థులతో మాట్లాడగా తిన్నతరువాత కడుపులో ఒకవైపు నొప్పి ఎక్కువైందని, శ్వాస ఆడక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు.
విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనతో వసతి గృహానికి చేరుకున్నారు. మిగతా విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్లారు. నాణ్యమైన భోజనం అందించడంలో వార్డెన్ పట్టించుకోవడంలేదని, 3 రోజుల నుంచి కడుపునొప్పితో బాధపడుతున్నామని చెప్పినప్పటికీ మామూలే ఏంకాదని అన్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితమే వైద్యం అందించిఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని, వార్డెన్ నిర్లక్ష్యమే కారణమంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వార్డెన్ ను సస్పెండ్ చేయాలి: ఎస్ఎఫ్ఎస్ఐ
విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఎస్ఐ నాయకులు హాస్టల్ గేటు ఎదుట ఆందోళన నిర్వహించారు. నాణ్యతలేని కూరగాయలు పెట్టడం వల్ల, వార్డెన్ సక్రమంగా పట్టించుకోవడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని అన్నారు. వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.