- మృతుల్లో ఇద్దరు చిన్నారులు.
అనన్య న్యూస్, మైసూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విహారయాత్ర ఓ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారును ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ఒకే కుటుంబానికి చెందిన 10 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సోమవారం కర్ణాటకలోని మైసూరు జిల్లా టీ నరిసిపూర్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. బస్సు ఢీకొట్టడంతో నుజ్జయిన కారులో చిక్కుకున్న కొందరు క్షతగాత్రులను వెలికితీసి చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. బళ్లారి ఏరియాకు చెందిన ఓ కుటుంబం ఇన్నోవా కారులో మైసూరు ట్రిప్‌కు బయలుదేరిందని, మార్గమధ్యలో వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.