-రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం..
అనన్య న్యూస్, మహబూబ్ నగర్: వలసల జిల్లా గా పేరుపడ్డ మహబూబ్ నగర్ జిల్లాను అభివృద్ధి చెందిన జిల్లాగా మార్చడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని, ఆయన ఆశయానికి మంత్రులందరు అండగా ఉంటారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి అవుతున్న సందర్బంగా గురువారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం, అమిస్తాపూర్ గ్రామ సమీపంలో మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన రైతు పండగ సదస్సును ఆయన ప్రారంభించారు. రైతుల అవగాహన కోసం అధికారులు ఏర్పాటు చేసిన వ్యవసాయ అనుబంధ స్టాల్స్ ను రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహా, జూపల్లి కృష్ణా రావు, ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వాకిట శ్రీహరి, పర్నికా రెడ్డి, వంశీ కృష్ణా, మేఘారెడ్డి తో కలిసి పరిశీంచారు. పలువురు రైతులతో ముచ్చటించారు.
ఈ సందర్బంగా తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయం తోపాటు, సాంకేతికతను జోడించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే విధంగా వ్యవసాయ మెలకువలను అందించడానికి మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన రైతు పండుగ వ్యవసాయ సదస్సు ఉపయోగపడుతుందన్నారు. వ్యవసాయ రంగంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకటరెడ్డి లాంటి మేధావులు రైతులకు లాభసాటి వ్యవసాయం ఏ విధంగా చేయాలో ఈ సదస్సులో అవగాహన కల్పిస్తారని అన్నారు. చింతల వెంకట్ రెడ్డి గురించి ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఏ పంట వేసినా అత్యధిక దిగుబడి తీయడంలో చింతల వెంకట్ రెడ్డి ఆదర్శంగా ఉంటారని కొనియాడారు. ఇతర దేశాల్లో ఎలాంటి పంటలు పండించి లాభం పొందుతున్నారు, కొత్త పంటల పై రైతులకు మూడు రోజుల సదస్సులో అవగాహన కల్పిస్తారని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ 117 స్టాళ్ళతో ఏర్పాటుచేసిన ఇంత గొప్ప రైతు సదస్సు ను ఇప్పటి వరకు తాను చూడలేదని అన్నారు. 2003-2004 ప్రాంతంలో వ్యవసాయం దండగ అని ప్రచారం జరిగితే అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రారంభించి కొంతవరకు పూర్తి చేయడం వల్ల వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపించారన్నారు.
రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం జరిగిందని అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 70 వేల కోట్లు కంటే తక్కువ రుణభారం ఉండేదని,గడచిన పది సంవత్సరాల కాలంలో ఏకంగా 8 లక్షల కోట్లు అప్పు చేసి ప్రభుత్వం అప్పజెప్పిందని గత ప్రభుత్వం చేసిన అప్పులకు గడచిన పది నెలల్లో సుమారు 60000 కోట్లు వడ్డీ కిందనే చెల్లించడం జరిగింది అన్నారు. ఇలాంటి క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో సైతం ప్రభుత్వం వచ్చాక రైతు రుణ మాఫీ చేసిందని తెలిపారు.
రైతు పండగ కార్యక్రమ సభాధ్యక్షులు , దేవరకద్ర శాసన సభ్యులు జి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నవంబర్ 28 నుంచి 30వ తేదీ వరకు మూడు రోజులపాటు రైతులకు సేంద్రియ, ఆధునిక వ్యవసాయంపై ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తల ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈ సంవత్సర కాలంలో 52 వేల కోట్లు రైతులకు వివిధ పథకాల కింద ఖర్చు చేయడం జరిగిందన్నారు. స్వయంగా రైతు బిడ్డ అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రైతుకు ఏ విధంగా అండగా ఉండి సహాయ సహకారాలు చేయాలో ప్రణాళికలు రూపొందిస్తున్నారని, 30 న ముఖ్యమంత్రి విచ్చేసి రైతులకు సంతోషకరమైన ప్రకటన చేసే అవకాశం ఉందన్నారు. రాష్ట్రం నలుమూలల నుండి రైతులు భారీగా తరలి రావాలని కోరారు.