- అశ్రునయనాల మధ్య శ్వేతా రెడ్డి అంత్యక్రియలు
అనన్య న్యూస్, జడ్చర్ల: మాజీ మంత్రి, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా రెడ్డి అంత్యక్రియలు మంగళవారం అశేష జనవాహిని మధ్య అశ్రు నాయనాలతో పూర్తయ్యాయి. గత కొన్ని రోజులుగా శ్వేతా రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ చెన్నై ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందారు. ప్రత్యేక విమానంలో తీసుక వచ్చిన శ్వేతా రెడ్డి మృతదేహాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి జడ్చర్ల మీదుగా వారి స్వగ్రామం ఆవంచకు తీసుకువచ్చారు.

మంగళవారం జరిగిన శ్వేతా రెడ్డి అంతక్రియలకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, మాజీ మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, గంగుల ప్రతాప్, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, శ్రీహరి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, రాజేష్ రెడ్డి, ఈర్లపల్లి శంకర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, రెడ్డి సుదర్శన్ రెడ్డి, జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ లు బాద్మి శివకుమార్, ఇంతియాజ్ ఇసాక్, ఎర్రోళ్ల శ్రీనివాస్, వెంకటేశ్వర్ రెడ్డి, రజిని, తదితరులు ఆవంచకు చేరుకొని శ్వేతా రెడ్డికి నివాళులు అర్పించి అంత్యక్రియలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి కన్నీటి పర్యంతం అయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వివిధ మండలాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులతో పాటు అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున తరలి రావడంతో ఆవంచ గ్రామం జనసంద్రం అయ్యింది. వ్యవసాయ పొలంలో అంత్యక్రియలు జరుగగా శ్వేతా రెడ్డి చితికి ఆమె కుమారుడు స్వరూన్ రెడ్డి నిప్పు అంటించడంతో అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.