- వసతులు లేక లబ్ధిదారుల ఆవేదన..
- గృహప్రవేశానికి ముందే దెబ్బతింటున్న ఇండ్లు..
అనన్య న్యూస్, జడ్చర్ల: మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట 2వ వార్డులో నిర్మించిన 120 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు గృహప్రవేశాల కోసం వేచి చూడక తప్పడం లేదు. 2023 ఆగస్టులో అప్పటి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 120 మంది లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. కానీ డబుల్ రూమ్ ఇండ్లలో ఎలాంటి వసతులు కల్పించలేదు. లబ్ధిదారులకు ప్రధాన అవసరాలైన తాగు నీటి కోసం నల్ల కలెక్షన్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయలేదు, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేదు. వీటికి తోడు మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. డబుల్ ఇండ్లపై నీటి కోసం ఏర్పాటు చేసిన ట్యాంకులను కొందరు ధ్వంసం చేయడం, నీటి పైపులు, ఇండ్ల తలుపులు ఎత్తుకెళ్లడం, కిటికీల అద్దాలను పగలగొడుతున్నారు.

డబుల్ ఇళ్లను మద్యం సేవించడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మార్చుకుంటున్నారు. దీంతో పరిస్థితి ఇలాగే కొనసాగితే కొద్ది రోజుల్లోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకు పనికిరాకుండా శితిలావస్థకు చేరేలా ఉన్నాయని లబ్ధిదారులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండ్ల పట్టాలిచ్చిన గృహప్రవేశాలు కూడా చేయకుండానే తమ డబుల్ ఇండ్ల ఆశలు చిద్రమయ్యే పరిస్థితి తలెత్తుతోందని వాపోతున్నారు. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి చొరవ తీసుకొని డబుల్ ఇండ్లల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు.

