అనన్య న్యూస్, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ ఎంపీ గా బిజెపి అభ్యర్థి డీకే అరుణ గెలుపొందారు. మంగళవారం వెలువడిన లోక్ సభ ఫలితాలలో మహబూబ్ నగర్ లో కమలం వికసించింది. మహబూబ్ నగర్ ఎంపీ గా బీజేపీ అభ్యర్థి డీ.కే అరుణ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో గెలుపు సాధించారు. తన సమీఫ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి మీద 4500 ఓట్ల స్వల్ప మెజార్టీ తో ఆమె విజయం సాధించారు.
మొదటి రౌండ్ నుండి డీకే అరుణకు స్వల్ప ఆధిక్యం కొనసాగినప్పటికి రౌండ్ రౌండ్ కు తీవ్ర ఉత్కంఠ రేపిన ఫలితాలు అభ్యర్థులకు చెమటలు పట్టించాయి. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో మక్తల్, నారాయణ పేట, కొడంగల్, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. డీకే అరుణకు మొత్తం 5,10,747 ఓట్లు రాగ, కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డికి మొత్తం 5,06,247 ఓట్లు వచ్చాయి. 2019 వరకు కాంగ్రెస్ లో ఉన్న డీకే అరుణ అదే సంవత్సరం వచ్చిన లోక్ సభ ఎన్నికల సందర్బంగా బీజేపీ పార్టీలో చేరారు.