అనన్య న్యూస్, హైదరాబాద్: ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదని.. చేసే ప్రతి పనిని ధ్యానంగా పాటించాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని ఆయన సికింద్రాబాద్‌లోని మహాబోధి బుద్ధ విహార్‌ను సందర్శించారు. గౌతమ బుద్ధుడి సందేశం అందరికీ అవసరమని రేవంత్ వ్యాఖ్యానించారు. మహాబోధి బుద్ధ విహార్‌కు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని.. ధ్యాన మందిరం కోసం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపాదనలు పంపితే ఎన్నికల కోడ్ ముగిశాక నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు.
మహాబోధి బుద్ధ విహార్‌ను సందర్శించాక.. గొప్ప క్షేత్రాన్ని సందర్శించిన అనుభూతి కలిగిందన్నారు. రాజ్యం, అధికారం రెండూ ఉండి.. వాటిని కాదని 29 సంవత్సరాల వయసులో శాంతి కోసం బుద్ధుడు ఆలోచించాడని, ఆయనే అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. రెండున్నర వేల సంవత్సరాలుగా బౌద్ధ సిద్ధాంతం నిలబడి ఉందంటే.. అది గౌతమ బుద్ధుడు చేసిన కృషి అని కొనియాడారు. తాను ఏ పనినైనా ఎంతో ధ్యానంగా చేస్తానని తెలిపారు. సమాజంలో అసహనం, అసూయ పెరిగిపోతున్నాయన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఒక ధ్యాన పాఠశాలను నిర్వహించాలని కోరారు.
సమాజంలో స్ఫర్థలు, ఉద్వేగాలు పెరిగేలా వాతావరణం ఉందన్నారు. దేశం ఇప్పుడున్న పరిస్థితిలో బుద్ధుని సందేశం ఎంతో అవసరమని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ బుద్ధుడి సందేశాన్ని చేరవేసేందుకు అవసరమైన సహాయం.. ఒక వ్యక్తిగా, ఒక ప్రభుత్వం నుంచి చేస్తామన్నారు. ఈ ప్రభుత్వం ప్రజలదని, అన్ని సహాయ, సహకారాలుంటాయని పేర్కొన్నారు. తెలంగాణలో బుద్ధ భిక్షులను ఎల్లప్పుడూ గౌరవిస్తామన్నారు..