- రోడ్డు ప్రమాదాల నివారణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది: కలెక్టర్..
అనన్య న్యూస్: మహబూబ్ నగర్: రోడ్డు భద్రత అనేది అత్యంత ప్రాధాన్యమైనదని, రోడ్డు ప్రమాదాలను నివారించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ అన్నారు. ఈ నెల 15 నుండి ఫిబ్రవరి 14 వరకు నెల రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మంగళవారం ఐడిఓసి లో ఆయన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మానవ తప్పిదాల వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. రోడ్డు ప్రమాదాలలో 18 నుండి 45 సంవత్సరాల లోపు ఉన్న వారు ఎక్కువగా చనిపోతున్నారని, దీనివల్ల కుటుంబానికి, సమాజానికి అతిపెద్ద నష్టం కలుగుతున్నదని, వీటిని నివారించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని అన్నారు. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న పిల్లలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని, ఆటోలు, ట్రాలీలు, టాక్సీలు, ప్రైవేట్ వాహనాలలో ప్రజలు ప్రయాణించకుండ, ఎక్కువ మందిని తీసుకెళ్లకుండా గట్టినిగా ఉంచాలని అన్నారు.
రోడ్డు నియమాలను పాటిస్తూ వాహనాలు నడపడం వల్ల సురక్షితంగా ఉంటుందని, అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, గట్టి నిఘావల్లనే వాహనాలు నడిపే వారిలో భయం వస్తుందని తెలిపారు. జాతీయ రహదారిపై దాబాల్లో అక్రమ మద్యం వంటి వాటిని అరికట్టడంపై ఎక్సైజ్ శాఖ దృష్టి సారించాలని తెలిపారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ ధరించాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడుపడం చేయకుండా అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు భద్రతపై చిన్న చిన్న వీడియోలను రూపొందించి ఆయా సందర్భాలలో తెలియజేస్తే బాగుంటుందని రోడ్డు రవాణా శాఖ అధికారులకు సూచించారు. ఆర్టీవో దుర్గా ప్రమీల, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నరేష్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ , రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్. మోహన్ రావు, డిఆర్ఓ కే వి వి రవికుమార్, జిల్లా అధికారులు ఉన్నారు.