అనన్య న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ల నియామాకాలకు మార్గం సుగమమైంది. తెలంగాణ హైకోర్టు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ నాలుగు వారాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని హైకోర్టు డివిజన్ బెంచ్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డును ఆదేశించింది.
వివరాల్లోకి వెళితే గత ఏడాది ఏప్రిల్ 25న కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ టీఎస్ఎల్పీఆర్బీ నోటిఫికేషను విడుదల చేసింది. ఆగస్టు నెలలో పరీక్షలు నిర్వహించింది. అక్టోబర్ 05 న ఫలితాలను విడుదల చేసింది. అయితే ప్రశ్న పత్రంలో నాలుగు ప్రశ్నలు తప్పులున్నాయని వాటికి మార్కులు కలపాలని కొంత మంది అభ్యర్థులు హైకోర్టు సింగిల్ బెంచ్ ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ నాలుగు మార్కులు కలపాలని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది.
అయితే దీనిపై మరి కొంత మంది అభ్యర్థులు అభ్యంతరం తెలుపుతూ హైకోర్టు డివిజన్ బెంచ్ కు వెళ్లారు. పలు సార్లు విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును గురువారం కొట్టివేస్తూ నాలుగు మార్కులు కలపాలా? వద్దా? అనేది ఎక్స్పర్ట్ కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఇదే సమయంలో నాలుగు వారాల్లో రిక్రూట్మెంట్ పూర్తి చేయాలని న్యాయస్థానం బోర్డును ఆదేశించింది. దీంతో 15,640 కానిస్టేబుల్ పోస్టులకు అడ్డంకి తొలిగినట్లు అయ్యింది.