- కొత్తగా పార్టీలోకి ఎవర్ని ఆహ్వానించేది లేదు..
అనన్య న్యూస్, జడ్చర్ల: నియోజకవర్గం ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అలాగే నాపై నమ్మకంతో నీతికి పట్టం కట్టి, నన్ను గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
భూ కబ్జాలకు, సెటిల్మెంట్లకు వత్తాసు పలకనని ఎంతటి వారినైనా శిక్షించేందుకు అధికారులకు పూర్తి అధికారాలు ఉంటాయని తన పార్టీ వాళ్ళైనా తప్పు చేస్తే శిక్షలు తప్పవని కొత్తగా పార్టీలోకి ఎవర్ని ఆహ్వానించేది లేదని కరాఖండిగా తేల్చిచెప్పారు. నేను తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంటే నియోజకవర్గానికి రావట్లేదని కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఒక్కసారైనా జడ్చర్ల నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక మాఫియా పై ప్రశ్నించాడా? లేదా దానిని ఆపగలిగిండా అని అన్నారు. నేను తీవ్రమైన జ్వరంతో ఉన్న కూడా నిన్న నవాబ్ పేట్ మండలంలో ఇసుక మాఫియా గురించి మాట్లాడి 13 మందిపై కేసులు బుక్ చేయించి అక్కడున్న ఇసుక డంపుల్ అన్ని సీజ్ చేయించడం జరిగిందన్నారు.
అన్ని మండలాలలో ఉన్న ఇసుక డంపులన్నీ తక్షణమే అధికారులు సీజ్ చేయాలని ఆదేశించారు. లేదంటే నేనే స్వయంగా అక్కడికి వచ్చి నిలబడతానని హెచ్చరించారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ఎన్నికైన కోమటిరెడ్డి వెంకటరెడ్డినీ కలిసి మొదటి విడుతలనే జడ్చర్ల నియోజకవర్గానికి 100 కోట్లు కేటాయించి రోడ్లు వేయడానికి ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇసుక మాఫియా పట్ల కఠినంగా వ్యవహరిస్తానని ఇప్పటికే మైనింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో జరిగిన అవినీతిని పూర్తిగా బయటికి తీస్తానని, అంతేకాకుండా పందులను పట్టుకుని వాటిని ఎం చేశారు ఇందులో ఎవరి ప్రమేయం ఉందో వారిపై తప్పకుండా చర్యలు చేపడతానన్నారు.