అనన్య న్యూస్, జడ్చర్ల: కట్టుకున్న భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటం చూసి తట్టుకోలేక పోయిన భర్త కత్తెరతో పొడిచి ఆమెను హతమార్చడంతో పాటు ఆమె ప్రియుడి గొంతు కోశాడు. బుధవారం జడ్చర్ల పట్టణంలో చోటు చేసుకున్న సంఘటన సంబంధించి జడ్చర్ల సిఐ రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం భూత్పూర్ మండలం బట్టుపల్లికి చెందిన శేఖర్ గౌడ్ కు కొత్తమొల్గరకు చెందిన అనూష (26) తో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు సంతానం. జడ్చర్ల పాత బస్టాండు రహదారిలోని ఓ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.
భర్త మెకానిక్ పని చేస్తుండగా భార్య ఇంటి ముందు టైలరింగ్ దుకాణం నిర్వహిస్తోంది. పనికి వెళ్లిన శేఖర్ గౌడ్ ఇంటికి తిరిగి రాగా భార్య ఓ యువకుడితో సన్నిహితంగా ఉందని, దీన్ని జీర్ణించు కోలేని శేఖర్ గౌడ్ భార్యపై కత్తెరతో దాడిచేయగా తీవ్ర గాయాలతో మృతిచెందింది. అతడికి గాయాలు కాగా మహబూబ్ నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివాహేతర సంబంధం అనుమానంతోనే భార్యను హత్య చేసినట్లు సీఐ తెలిపారు. అనూష తల్లి జయమ్మ ఫిర్యాదు మేరకు శేఖర్ గౌడ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.