అనన్య న్యూస్, జడ్చర్ల: తెలంగాణ విద్యా వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ తెలంగాణ విద్యా వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలను కల్పిస్తూ విద్యా వ్యవస్థను ఆదర్శంగా నిలిపారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ అల్పాహార పథకాన్ని శుక్రవారం జడ్చర్ల మండలం కోడుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ తో కలిసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్ విద్యార్థులతో కలిసి అల్పాహారాన్ని తీసుకున్నారు.
10వ తరగతి విద్యార్థులకు డిజిటల్ స్టడీ మెటీరియల్ ను, యువజన సంఘాలకు స్పోర్ట్స్ కిట్స్ ను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారని, దేశ చరిత్రలో ఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేయని విధంగా మానవీయ కోణంలో ఆలోచించి పేద విద్యార్థులకు అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్ రావు, జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, ఎంఈఓ మంజులాదేవి, సర్పంచ్ మమత, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మారేపల్లి శ్రీనివాసులు, జిల్లా సెక్టోరియల్ అధికారి గోవర్ధన్ గౌడ్, నాయకులు తదితరులు ఉన్నారు.