అనన్య న్యూస్, జడ్చర్ల: అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా కర్ణాటక రాష్ట్రం నుండి డీజిల్ ను తరలిస్తున్నట్యాంకర్ ను జడ్చర్ల పోలీసులు పట్టుకున్నారు. శనివారం జడ్చర్ల మండల పరిధిలోని గంగాపూర్ గ్రామ సమీపంలో అనుమానాస్పదంగా ఆపి ఉన్న డీజిల్ ట్యాంకర్ ను గుర్తించిన స్థానిక ప్రజలు మండల విలేకరులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న జడ్చర్ల విలేకరులకు డీజిల్ ట్యాంకర్ డ్రైవర్ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై చంద్రమోహన్ రావు అక్రమంగా తరలిస్తున్న డిజిల్ ట్యాంకర్ ను జడ్చర్ల లోని జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీజిల్ ట్యాంకర్ కు సంబంధించిన బిల్లులు రూటు, లోడింగ్ కు సంబంధించిన పత్రాలను పరిశీలించిన తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందన్నారు. అనుమాన స్పదంగా దొరికిన డీజిల్ ట్యాంకర్ దేవరకద్ర నుండి డీజిల్ తీసుకొని డిండి వెళుతున్నట్టు డ్రైవర్ చెప్తుండగా, మక్తల్ ప్రాంత సరిహద్దులో ఉన్నకర్ణాటక రాష్ట్రంలోని ఓ పెట్రోల్ బంక్ లో డీజిల్ నింపుకొని తీసుకు వెళ్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి లక్షల రూపాయల్లో గండికొడుతూ కర్ణాటక నుంచి అక్రమంగా డీజిల్ తరలిస్తున్న వ్యాపారస్తులు అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు ఇలాంటి అక్రమాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.